- ఆర్టిఏ కార్యాలయాల్లో ఇంకెంత కాలం ఈ దోపిడి
- ప్రశ్నిస్తున్న వినియోగదారుల హక్కుల కార్యకర్త, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు
వరంగల్ బ్యూరో, న్యూస్ పేజ్ :
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా తయారైంది ఆర్టిఏ కార్యాలయాల్లో పరిస్థితి. దీనికి కారణం లేకపోలేదు. అసలు విషయమేమిటంటే..
ఆర్టిఏ కార్యాలయాల్లో జరగాల్సిన పనులకు ఇంకెంత కాలం అదనంగా చెల్లింపులు చేస్తూ జేబులు ఖాళీ చేసుకోవాలి అంటున్నారు వినియోగదారుల ఉద్యమకారుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి బుక్ రెన్యువల్, చిరునామా మార్పు లాంటి పనులకు ప్రత్యేకంగా ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్ లైన్ లో ఇంటి నుంచే పొందే వీలుగా కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల సౌకర్యార్థం "సారథి పోర్టల్" తీసుకువచ్చింది. అయితే..
ఎంతకూ కనిపించని వివరాలు..
ఈ పోర్టల్ సాయంతో ఎం పరివాహన్ యాప్ లో పలు సేవలను ప్రత్యేకంగా ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచి పొందవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి కాని ఆచరణలో కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా అంతకుముందు ఆర్టిఏ ఆఫీసుల్లో అయ్యే ఖర్చుకు అదనంగా మరొక ఖర్చు వచ్చి చేరిందంటు ఆవేదనను వ్యక్తపరిచారు ఆయన.
తన ఆర్ సి బుక్ రెన్యువల్ చేయుటకు ఎం పరివాహన్ యాప్ లో ఓపెన్ చేసి చూస్తే ఆర్ సి బుక్కు వివరాలు ఎంత వెతికినా కనిపించలేదు. కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సారధి పోర్టల్ లో రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ లోనే చేరినప్పటికీ వాహనదారుల వివరాలను సారధి పోర్టల్ లోకి డేటాను ఎంటర్ చేయకపోవడంవల్ల..
తప్పనిసరి పరిస్థితుల్లో..
పోర్టల్ లో మన వివరాలు కనిపించక పోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఆర్టిఏ కార్యాలయాల వద్దగల ఏజెంట్లను సంప్రదించగా వారు అవును సార్ ఆ పోర్టల్ లో మన వివరాలు కనిపించడం లేదు ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఆఫీస్ సిబ్బంది దగ్గరికి వెళ్లి మాన్యువల్ గా సమాచారాన్ని ఎంటర్ చేయించాలని దానికి అదనంగా 400 రూపాయలు ఖర్చవుతుందనగా, అప్పటికే నా ఆర్ సి రెన్యువల్ చేసుకునే తేది అయిపోయి ఫైన్ పడే పరిస్థితి ఉండడం వలన విధిలేని పరిస్థితుల్లో డబ్బులు చెల్లించి పనిచేయించుకోవడం జరిగిందన్నారు. ఇలా ప్రతిరోజు ఎంతోమంది వినియోగదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి బుక్ రెన్యువల్, చిరునామా మార్పు లాంటి పనులకు అదనంగా డబ్బులు చెల్లించి పనులు చేయించు కోవడంతో ఆర్టిఏ ఆఫీసుల్లో పనిచేసే సిబ్బందికి ఇదొక ఆదాయ వనరుగా మారింది.
కావున.. వారు సారధి పోర్టల్ లోకి వినియోగదారుల డేటాను అప్ లోడ్ చేసి, అప్ డేట్ చేయటం లేదు కావచ్చు అనిపిస్తుందన్నారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం రవాణా శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, తక్షణమే అన్ని వాహనదారుల సమాచార నమోదుకు తగిన చర్యలు తీసుకోని వినియోగదారులను ఈ దోపిడీ నుంచి రక్షించాలని ఈ ప్రజా ప్రభుత్వం ఆ దిశన తగిన చర్యలు తీసుకొని ప్రజలకు సరైన సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నానన్నారు.
- Tags :
తెలంగాణ, ఆర్టీఓ ఆఫీస్, RTO Office Scam, Driving License Slot, Live Telugu News

మమ్మల్ని ఫాలో అవ్వండి