- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంచలన ప్రకటన!
- రైతులకు సాగునీరు అందించలేని అసమర్థ ప్రభుత్వం..
- కార్యకర్తకు ఆపద వస్తే ఒక్క మిస్ కాల్ చేయండి,
- మీ ముందుంటానని బీఆర్‌ఎస్ శ్రేణులకు భరోసా.
సదాశివపేట, నవంబర్ 03, న్యూస్ పేజ్ :
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలనను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై పోరాడేందుకు త్వరలోనే నియోజకవర్గవ్యాప్తంగా గ్రామగ్రామాన పాదయాత్రలు చేపడతామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రమ అరెస్టులు, రాజకీయ వేధింపులు మరియు అవమానాల గురించి పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యకర్తల సమస్యలను సావధానంగా విన్న చింతా ప్రభాకర్ వారికి తానున్నానంటూ అండగా ఉంటానని గట్టి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అంతర్గత కుమ్ములాటలతో కాలం గడుపుతున్నారని, రైతులకు సాగునీరు మరియు కరెంట్ అందించలేని దద్దమ్మ ప్రభుత్వంగా ఇది మిగిలిపోయిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తే, తాము అధికారంలోకి వస్తే 48 గంటల కరెంట్ ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు నేడు కనీస విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ కక్షలకు తావివ్వకుండా ప్రతిపక్షాలను గౌరవించామని, కానీ నేడు కాంగ్రెస్ వారు అనుసరిస్తున్న వేధింపుల విధానాలే భవిష్యత్తులో వారికి ఎదురవుతాయని హెచ్చరించారు.
పార్టీ కార్యకర్తకు ఏ చిన్న ఆపద వచ్చినా, సమస్య ఎదురైనా ఒక్క మిస్ కాల్ చేయండి.. మీ ముందుకు వచ్చి అండగా నిలబడతానని స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సి డి సి మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు గడిల సుధీర్ రెడ్డి, కోడూరి రమేష్, కుందనరాజు, పట్టణ పార్టీ అధ్యక్షులు చిల మల్లన్న, సీనియర్ నాయకులు చింత సాయినాథ్, ఆత్మకూరు నగేష్, స్థానిక సర్పంచ్ తొంట కిష్టయ్య, స్థానిక మాజీ సర్పంచ్లు లక్ష్మారెడ్డి, గడ్డమీద సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు సత్యనారాయణ యాదవ్, అమరేందర్ రెడ్డి, సుధాకర్, మాధవరెడ్డి, శివకుమార్, అల్లం లలిత, అహ్మద్, అశోక్, పండరి, సర్పంచులు రవికుమార్, కృష్ణారెడ్డి, సంతోష్ గౌడ్, ప్రమోద్, నవీన్కుమార్, నాగరాజు, గుడ్ల లక్ష్మణ్, యువత అధ్యక్షులు నరేష్ గౌడ్, నగేష్ యాదవ్, బిఆర్ఎస్వి ఇన్చార్జ్ శ్రీహరి, నిజాముద్దీన్, సలావుద్దిన్, పాండు నాయక్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు మాణిక్, రాములు, దశరథ్, నగేష్, సిద్ధన్న, సంగమేష్, కరుణాకర్, సంఘన్న, శేఖర్, రాములు, నాయకులు యాద గౌడ్, శంభు ప్రసాద్, నబీమియా, జైపాల్, శ్రీనివాస్ రెడ్డి, రఫీ, షబ్బీర్, రమేష్, పాషా, రవి, శివ తదితరులు పాల్గొన్నారు.
Tags : newspage news, MLA Chinta Prabhakar Padayatra, Sadasivapet BRS Atmiya Sammelanam, Sangareddy Congress Failures


మమ్మల్ని ఫాలో అవ్వండి