- ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీనియర్ నేత!
- సంగారెడ్డి పట్టణంలోని బ్రాహ్మణవాడలో రెండు భవ్య కమాన్ల ఏర్పాటుకు శ్రీకారం..
- మందిర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి హామీ.
సంగారెడ్డి, అక్టోబర్ 26, న్యూస్ పేజ్ :
సంగారెడ్డి పట్టణంలోని సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన గురునానక్ మందిరానికి వెళ్లే ప్రవేశ మార్గాలలో రెండు నూతన కమాన్ల (Arches) నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. గత గురునానక్ జయంతి ఉత్సవాల సందర్భంగా సిక్కు సమాజానికి ఇచ్చిన హామీ మేరకు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ నిర్మాణ పనులకు స్వయంగా శ్రీకారం చుట్టారు. పట్టణంలోని బ్రాహ్మణవాడ పరిధిలో గల గురునానక్ మందిరానికి వెళ్లే ప్రధాన ప్రవేశ మార్గంలో ఒకటి, మందిరానికి సమీపంలోని భవాని మందిర్ రోడ్డులో మరొక భవ్య కమాన్ ఏర్పాటుకు వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆయన శంకుస్థాపన చేశారు.
అంతకుముందు గురునానక్ మందిరాన్ని సందర్శించిన జగ్గారెడ్డి.. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర్ ప్రతినిధులు, సిక్కు ప్రముఖులు ఆలయానికి సంబంధించిన పలు దీర్ఘకాలిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై సానుకూలంగా స్పందించిన జగ్గారెడ్డి, అన్ని సమస్యలను త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మందిర్ ప్రాంగణంలో గల రావిచెట్టు కింద ఉన్న చారిత్రాత్మక నాగదేవత ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్‌కు జగ్గారెడ్డి సూచించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాలను యథాస్థానంలోనే ఉంచి, సాంప్రదాయ బద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ మహత్తర కార్యక్రమంలో సిక్కు సమాజ ప్రముఖులు డాక్టర్ సర్దార్ సురేందర్ గోపి సింగ్, సర్దార్ తేజేందర్ సింగ్, సర్దార్ స్వరణ్ సింగ్, సర్దార్ సత్‌పాల్ సింగ్, డాక్టర్ సర్దార్ భరత్ సింగ్, సిక్కు గురువు గురుదేవ్ సింగ్ పాల్గొన్నారు. వీరితో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, ప్రముఖ నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి, సుదీప్, నరేన్, సుధాకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భూమిపూజ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మందిరానికి విచ్చేసిన జగ్గారెడ్డిని సిక్కు సాంప్రదాయం ప్రకారం నిర్వాహకులు సిరోపాతో ఘనంగా సత్కరించారు.
Tags : newspage news, Sangareddy Gurunanak Mandir, Jaggareddy Kaman Bhoomipuja, Sikh Community Sangareddy

మమ్మల్ని ఫాలో అవ్వండి