- 25వ కళ్యాణ పర్వంలో ప్రత్యేక పూజలు!
- మహిళా జగద్గురు గంగా మాత ఆశీస్సులు తీసుకున్న తెలంగాణ బసవదళ్ ప్రతినిధులు.. మహాత్మా బసవేశ్వరుల ఆశయ సాధనకు కృతజ్ఞతా సంకల్పం.
సదాశివపేట, అక్టోబర్ 26, న్యూస్ పేజ్ :
కర్ణాటక రాష్ట్రంలోని చారిత్రక, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన బసవకళ్యాణ్‌ను వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో సందర్శించారు. అక్కడ అత్యంత వైభవంగా జరుగుతున్న 25వ ‘కళ్యాణ పర్వ’ మహోత్సవంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజ ప్రముఖులు, మహిళలు కలిసి క్షేత్రంలోని మహిళా జగద్గురు గంగా మాతను దర్శించుకుని ప్రత్యేక ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం బసవకళ్యాణ్ పుణ్యభూమిపై నిర్మించిన మహాత్మా బసవేశ్వరుల వివిధ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు అనిమిశెట్టి జయప్రకాష్‌తో పాటు తెలంగాణ రాష్ట్రీయ బసవదళ్ అధ్యక్షులు శంకర్ పాటిల్, ప్రధాన కార్యదర్శి అనిల్ పాటిల్, జిల్లా మాజీ అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్, శివరాజ్, బత్తుల అనిల్, వీర్ కుమార్, రాజు, చంద్రశేఖర్, శ్రీకాంత్, అమర్‌నాథ్ మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిమిశెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలోనే మహాత్మా బసవేశ్వరులు సమాజానికి అందించిన సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం మరియు ‘కాయకమే కైలాసం’ (శ్రమనే ముక్తి) అనే గొప్ప సందేశాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. బసవేశ్వరుల బోధనలు నేటి ఆధునిక సమాజానికి ఎంతో మార్గదర్శకమని, వారి ఆశయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ప్రసాది మధు శేఖర్ మాట్లాడుతూ.. బసవకళ్యాణ్ వంటి చారిత్రక, శరణుల పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా సమాజంలో అపారమైన ఐక్యత, భక్తిభావం మరియు ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుండి విచ్చేసిన వీరశైవ లింగాయత్ సమాజ ప్రతినిధులను కర్ణాటక ఆలయ నిర్వాహకులు బసవ శాలువాలతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఉత్సవాల అనంతరం భక్తులందరికీ భారీ ఎత్తున దాసోహం (అన్నప్రసాద వితరణ) కార్యక్రమం నిర్వహించారు.
Tags : newspage news, Basavakalyan Lingayat Visit, Animishetty Jayaprakash, Telangana Basavadal Shankar Patil

మమ్మల్ని ఫాలో అవ్వండి