- మహనీయుల చరిత్రను స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు
- చరిత్రని వక్రీకరించి ఛత్రపతిని రాజకీయ లబ్ది కోసం..
- బీజేపీ వాడుకుంటోందని జగ్గారెడ్డి ఆరోపణ
- సంగారెడ్డి బైపాస్ రోడ్ లో చత్రపతి విగ్రహా ఏర్పాటుకు జరిగిన..
- భూమి పూజ కార్యక్రమం లో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
సంగారెడ్డి బ్యూరో, న్యూస్ పేజ్:
ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డులో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, రాజ్య భద్రతకు మాత్రమే ప్రాధాన్యమిచ్చిన గొప్ప ప్రజా నాయకుడు ఛత్రపతి శివాజీ అని పేర్కొన్నారు. గొప్ప వీరుడైన ఆయన గురించి నేటి యువత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.
రాజకీయ లబ్ధి కోసం చరిత్ర వక్రీకరణ..
శివాజీ మహారాజ్ చరిత్రను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించి ప్రచారం చేస్తోందని జగ్గారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. శివాజీ పాలనలో హిందువులతో పాటు ముస్లింలు కూడా సమానంగా ఉన్నారని, దౌలత్ ఖాన్, ముల్లా హైదర్ వంటి ముస్లిం అధికారులు ఆయన సైన్యంలో, పరిపాలనలో అత్యంత ఉన్నత స్థాయిలో పనిచేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా కేవలం తన రాజ్యంలోని ప్రజల బాగోగుల కోసం మాత్రమే శివాజీ నిరంతరం కృషి చేశారని అన్నారు.
ఒక రాజుగా కేవలం రాజ్య విస్తరణ, సరిహద్దు రక్షణ కోసమే ముస్లిం పాలకులతో యుద్ధాలు చేశారే తప్ప, ముస్లిం ప్రజలపై ఆయన ఎన్నడూ దాడులు చేయలేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. నాడు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలకు నేడు మతపరమైన రంగులు, అర్థాలు ఆపాదించడం ఎంతమాత్రం సరికాదన్నారు. యువత శివాజీ మహారాజ్ చరిత్రను నిష్పక్షపాతంగా అధ్యయనం చేసి, ఆయన వీరత్వం, పాలనా దక్షత, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
Tags: Newspage, Sangareddy News, Jagga Reddy Comments, Chhatrapati Shivaji Maharaj Statue, TPCC Working President, Sangareddy Congress Updates

మమ్మల్ని ఫాలో అవ్వండి