- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పులిమామిడి రాజు, చైర్‌పర్సన్ అంజమ్మ!
- మహా పూర్ణిమను పురస్కరించుకొని భవసార్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో
- తుల్జాపూర్ సంప్రదాయంలో పూజలు.. పురవీధుల్లో అమ్మవారి భవ్య ఊరేగింపు.
సదాశివపేట, అక్టోబర్ 25, న్యూస్ పేజ్ :
సదాశివపేట పట్టణంలోని హట్కరిపేటలో వెలసిన భవసార్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో భవాని మాతా నవరాత్రుల ముగింపు వేడుకలను పురస్కరించుకొని మహా పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు, సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తుల్జాపూర్‌లో నిర్వహించే పవిత్ర పూజా సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆదివారం తెల్లవారుజామున నుంచే అమ్మవారికి మేలుకొలుపు సేవ, ప్రత్యేక అభిషేకం మరియు కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు.
ఉత్సవాలలో భాగంగా సాయంత్రం వేళ భవాని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తుల భజనలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ సదాశివపేట పట్టణంలోని పురవీధుల గుండా అమ్మవారి భవ్య ఊరేగింపును కన్నులపండువగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కదిలివచ్చిన జగన్మాతను దర్శించుకొని కర్పూర హారతులతో మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపు ముగిసిన తర్వాత ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ భవసార్ క్షత్రియ సమాజ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకల్లో స్థానిక కౌన్సిలర్ కోవూరి శంకర్ గౌడ్, ప్రముఖ నాయకులు విజయ్, భవసార్ క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు వాదోని చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు రమేష్, అర్జున్, గోవర్ధన్ రావు, త్రియాంబక్, తులసీదాస్, హరి, ఎం. విజయ్‌తో పాటు సమాజ్ సభ్యులు, వార్డు పెద్దలు మరియు భక్తులు వందలాదిగా పాల్గొన్నారు. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ముఖ్య అతిథులను ఆలయ కమిటీ ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Tags : newspage news, Sadasivapet Bhavani Mata, Hatkaripeta Purnima Pooja, Bhavasar Kshatriya Samaj

మమ్మల్ని ఫాలో అవ్వండి