Ticker

6/recent/ticker-posts

Ad Code

హైదరాబాద్‌ను 30వ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి.. హైదరాబాద్ రాష్ట్ర సమితి బహిరంగ లేఖ

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ‘హైదరాబాద్ రాష్ట్ర సమితి’ బహిరంగ లేఖ
  • ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కాంక్షిస్తూ హైదరాబాద్ రాష్ట్ర సమితి నేతల సంచలన డిమాండ్స్
  • ‘ఫ్యూచర్  సిటీ’ అభివృద్ధిని కాంక్షిస్తూ కొలిపాక తులసి దాస్, కొలిపాక శ్రీనివాస్, బాలాజీ సింగ్ సంచలన డిమాండ్స్

Leaders of Hyderabad State Samithi releasing an open letter demanding Hyderabad as the 30th special state of India.

హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 14 (న్యూస్ పేజ్):

భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న "ఫ్యూచర్  సిటీ" హైదరాబాద్‌ను దేశంలోనే 30వ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ‘హైదరాబాద్ రాష్ట్ర సమితి’ ముఖ్య నాయకులు కొలిపాక తులసి దాస్, కొలిపాక శ్రీనివాస్, బాలాజీ సింగ్ స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో కూడిన ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ మేరకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా, ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గార్లకు లేఖలు రాస్తూ పలు కీలక ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు.

రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 ద్వారా లభించిన భావప్రకటనా స్వేచ్ఛను స్మసరిస్తూ, హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ డిమాండ్‌కు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.

48 స్థానాలతో ప్రత్యేక రాష్ట్రం ఎందుకు సాధ్యం కాదు?

"పొరుగున ఉన్న గోవా రాష్ట్రంలో కేవలం 40 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అలాంటిది హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, మెదక్ జిల్లాల పరిధిలోని దాదాపు 48 శాసనసభ నియోజకవర్గాలను కలుపుతూ హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం భౌగోళికంగా, పరిపాలనాపరంగా ఎంతో సులువవుతుంది. గచ్చిబౌలి, మాదాపూర్, నానక్ రామ్‌గూడ, లింగంపల్లి లాంటి ఐటీ కారిడార్ల ద్వారా వచ్చే వందల కోట్ల పన్నుల ఆదాయం, దాదాపు 500 సినిమా థియేటర్లు, రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ, పద్మాలయ వంటి స్టూడియోలతో కూడిన వినోద పరిశ్రమ, వస్త్ర వ్యాపార హోల్‌సేల్ మార్కెట్లు ఈ నూతన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొండంత అండగా నిలుస్తాయి" అని కొలిపాక శ్రీనివాస్ విశ్లేషించారు.

హైదరాబాద్‌లో 'రెండవ రాజధాని' - పార్లమెంట్ భవనం!

ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీ తీవ్ర కాలుష్యంతో, శీతాకాల సమావేశాల సమయంలో దట్టమైన మంచుతో అతలాకుతలమవుతోంది. దీనివల్ల ప్రజాప్రతినిధుల ఆరోగ్యం దెబ్బతినడమే కాక సభా సమయం వృధా అవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా, భౌగోళికంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి 15 రాష్ట్రాలకు నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌లో భారతదేశ రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఫిర్జాదిగూడ, ప్రతాపసింగారం, పర్వతాపూర్ ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయని, అక్కడ పార్లమెంట్ శీతాకాల సమావేశాల భవనంతో పాటు ఎంపీల క్యాంప్ ఆఫీసులను అద్భుతంగా నిర్మించవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

సుప్రీం కోర్ట్ బెంచ్ & గ్రేటర్ సికింద్రాబాద్ కార్పొరేషన్ (GSMC)

దక్షిణాది రాష్ట్రాల కక్షిదారులకు ఢిల్లీ వెళ్లి న్యాయం పొందడం ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని. కాబట్టి హైదరాబాద్‌లో వెంటనే సుప్రీం కోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసి సత్వర న్యాయ సహాయం అందించాలని కొలిపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీంతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం సికింద్రాబాద్‌ను గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GSMC) గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.

మేడ్చల్ కలెక్టరేట్ సికింద్రాబాద్‌లోనే నిర్మించాలి!

ప్రస్తుత మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కుత్బుల్లాపూర్ వైపు ఉండటం వల్ల జిల్లాలోని మిగతా ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. కాబట్టి మేడ్చల్ జిల్లా ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ నూతన భవనాన్ని సికింద్రాబాద్ పరిధిలోనే నిర్మించాలని మేడ్చల్ జిల్లా ప్రజల పక్షాన కొలిపాక శ్రీనివాస్ బలమైన విజ్ఞప్తిని లేఖ ద్వారా వినిపించారు. న్యూయార్క్‌ను తలపించే మాదాపూర్ స్కైలైన్లు, ట్యాంక్ బండ్ అందాలు, జగత్ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ బిర్యానీ, చిలుకూరు వీసా బాలాజీ, బోడుప్పల్ నిమిషాంబ దేవి, ఎల్బీనగర్ అష్టలక్ష్మి దేవాలయం, సికింద్రాబాద్ గణేష్ మరియు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ఈ 'భాగ్యనగరం' ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన ముందస్తు విజయదశమి (దసరా) శుభాకాంక్షలు తెలియజేశారు.

కొలిపాక శ్రీనివాస్ ప్రతిపాదనకు ప్రముఖుల సంఘీభావం

హైదరాబాద్‌ను 30వ ప్రత్యేక రాష్ట్రంగా మార్చాలంటూ కొలిపాక తులసి దాస్, కొలిపాక శ్రీనివాస్, బాలాజీ సింగ్ చేసిన ఈ చారిత్రాత్మక ప్రతిపాదనకు సమాజంలోని పలువురు ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ డిమాండ్‌ను బలంగా సమర్థిస్తూ హైకోర్టు సీనియర్ న్యాయవాది, హైదరాబాద్ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి కొలిపాక తులసి దాస్ (మూసాపేట), ఫిర్జాదిగూడకు చెందిన ప్రముఖ సభ్యులు అసల అంజయ్య, బోడుప్పల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కె. రుక్మాంగదన్ సంఘీభావం తెలిపారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన జన్ను ప్రవీణ్ (M.Com), ప్రముఖులు చిప్ప రమేష్, విశ్వనాథ్, అమీర్‌పేట్‌కు చెందిన డాక్టర్ జనగామ రవి, హైదరాబాద్ క్యాబ్ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు కె. సన్నీ మరియు నిమిషాంబ దేవి టెంపుల్ చైర్మన్ వినోద్ కుమార్ తదితరులు ఈ మేధోమథన లేఖకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ, భాగ్యనగర భవిష్యత్తు కోసం ఈ పోరాటంలో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు.


Tags: Newspage, Hyderabad 30th State Demand, Hyderabad State Samithi Open Letter, Kolipaka Srinivas Proposals, Second Capital Hyderabad, Greater Secunderabad Municipal Corporation GSMC