- జగ్గారెడ్డి, నిర్మల దంపతుల ఘన విజయం!
- నవంబర్ నెలలో మంత్రులు ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ, వివేక్‌ల చేతుల మీదుగా శంకుస్థాపన..
- 11 గ్రామాల్లోని 3,300 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి.
సదాశివపేట, అక్టోబర్ 28, న్యూస్ పేజ్ :
ఏడో నిజాం పాలనా కాలంలో నిర్మించిన చారిత్రాత్మక గంగ కత్వ కాలువ సమగ్ర ఆధునీకరణ పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి ఏకంగా రూ.37 కోట్ల భారీ నిధులను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నిర్మల దంపతులు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి సదాశివపేట మండలం సూరారం గ్రామంలోని గంగకత్వ ప్రాజెక్టును సాగునీటి శాఖ అధికారులు, ఆయకట్టు గ్రామాల రైతులు, స్థానిక నాయకులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగకత్వ కాలువ పరిధిలోని 11 గ్రామాల్లో 3,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. సదాశివపేట మండలంలో సుమారు 16 కిలోమీటర్ల మేర విస్తరించిన కాలువకు 28 చెరువులు అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. కాలువను ఆధునీకరించి, చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆధునీకరణ నిధుల కోసం రెండేళ్ల క్రితం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరానని, అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించానని తెలిపారు. రూ.37 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా లేకపోయినా రైతుల ప్రయోజనాల కోసం నిధులు తీసుకువచ్చానన్నారు. ఏటో నిజాం కాలంలో నిర్మించిన కాలువను తిరిగి ఆధునీకరించే అవకాశం రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా కాలువ లైనింగ్, దెబ్బతిన్న భాగాల మరమ్మతులు, పక్కలకు సీసీ లైనింగ్, తూముల పునరుద్ధరణ, వంతెనల వెడల్పు పెంపు తదితర పనులపై సమీక్షించారు. కాలువ పొడవునా తనిఖీలకు ఉపయోగపడే దారిని పునరుద్ధరించాలని సూచించారు. కాలువ నీరు చెరువులకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో వర్షాకాలంలో కాలువలు తెగిపోతున్నాయని చందాపూర్ గ్రామస్థులు జగ్గారెడ్డి దృష్టికి తెచ్చారు. మిలిగిరిపేట పరిధిలో వాగుల్లో పూడిక తొలగించాలని కోరారు. కాలువలు సరిగా లేక నీరు గ్రామంలోకి వస్తోందని పొట్పల్లి వాసులు వివరించారు. ప్రాజెక్టు చివరన ఉన్న తమ గ్రామానికి నీరందడం లేదని యెన్కేపల్లి రైతులు తెలిపారు. ప్రధాన కాలువ తూము వద్ద లీకేజీలతో నీరు వృథా అవుతోందని చెప్పారు. ఆత్మకూరు పరిధిలో లీకేజీలను అరికట్టి చెరువులకు నీరు మళ్లించాలని, అంకెన్‌పల్లిలో కాలువ ఆకృతి సవరణ, గట్ల బలోపేతం పనులు చేపట్టాలని స్థానికులు కోరగా.. సమస్యలను పరిశీలించి అవసరమైన పనులకు అంచనాలు రూపొందించాలని జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. గంగకత్వ ఆధునీకరణకు అదనంగా వాగుపై ఏడు చోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని జగ్గారెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి ప్రాంతం నుంచి గంగకత్వకు వచ్చే వాగును అభివృద్ధి చేస్తే నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాగు, ప్రాజెక్టులో పూడిక తొలగింపునకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ప్రాజెక్టులో ఆరు నుంచి ఏడు అడుగుల మేర పూడిక తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలపగా, సాంకేతికంగా ఎంతవరకు సాధ్యమో పరిశీలించాలని కోరారు. అలాగే కొల్కూరు–నిజాంపూర్ మధ్య మంజీరా బ్యాక్‌వాటర్ వల్ల పంటలు మునుగుతున్నాయని, అక్కడ చెక్‌డ్యామ్ నిర్మించాలని రైతులు కోరగా, సాధ్యాసాధ్యాలను పరిశీలించి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
దీపావళి తర్వాత నవంబర్ నెలలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వివేక్ ల చేతుల మీదుగా శంకుస్థాపన జరిగేలా చూస్తామని జగ్గారెడ్డి తెలిపారు. డిసెంబర్‌లోపు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. 2028 జూన్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు. డిసెంబర్‌లో మరోసారి ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. నిధులు, పనుల మంజూరు కోసం కృషి చేయడమే తన బాధ్యతని, శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను అధికారులు ప్రోటోకాల్ ప్రకారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి ఈ వాగుతో తనకు అనుబంధం ఉందని, తన భార్య స్వగ్రామం తాటిపల్లి కావడంతో తరచూ ఇక్కడికి వచ్చేవాడినని గుర్తుచేసుకున్నారు. ఈ పర్యటనలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి, సుదీప్, నరేన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పర్యటన సందర్భంగా గంగకత్వ కాలువలో జగ్గారెడ్డి స్వయంగా డైవ్ చేసి ఈత కొట్టారు.
Tags : newspage news, Gangakatwa Canal Modernization, Jaggareddy Suraram Project, Sangareddy Irrigation Funds

మమ్మల్ని ఫాలో అవ్వండి