హనుమకొండ ప్రతినిధి, న్యూస్ పేజ్ :
జులైవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలను శనివారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడారి భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతను, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు వహించే కీలక పాత్రను ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఈ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా పాఠశాలలో 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పోలింగ్ అధికారులు, ఏజెంట్లు, సెక్యూరిటీ సిబ్బంది విధులను కేటాయించి అసలు ఎన్నికలను తలపించేలా మధ్యాహ్నం వరకు ఎన్నికలు నిర్వహించారు. ఓటర్ల జాబితా పరిశీలన, చేతి వేలికి సిరా గుర్తు వేయడం వంటి ప్రక్రియలన్నింటినీ క్రమశిక్షణతో విద్యార్థులే పూర్తి చేశారు.
ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగం..
విద్యార్థులు ఉత్సాహంగా వరుస క్రమంలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ , స్పోర్ట్స్ కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ పదవులకు ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి, విజేతలను ప్రకటించారు. అనంతరం వారికి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. విద్యార్థులకు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా మారడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని, రాజకీయాలను ఒక వృత్తిగా చేపట్టడానికి బీజం పాఠశాలల్లోనే పడుతుందని, బాధ్యతాయుతమైన నీతివంతమైన రాజకీయ నాయకులుగా విద్యార్థులు ఎదగడానికి ఈ ఎన్నికలు దోహదపడతాయని హెచ్‌ఎం భాస్కర్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో..
ఈ ఎన్నికలను హనుమకొండ మండల విద్యాశాఖ అధికారి జి. నెహ్రూ నాయక్, కాజిపేట్ జాగీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.ఎన్.ఎం స్వామి సందర్శించారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు అరుణాదేవి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వెంకటేశ్వరరావు లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
1980వ సంవత్సరంలో స్థాపించబడి..
ఇక ఈ పాఠశాల విషయానికి వస్తే.. 1980వ సంవత్సరంలో స్థాపించబడింది. జులైవాడ, సుబేదారి, మరియు వడ్డేపల్లి పరిసర ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వ విద్యాశాఖ దీనిని ప్రారంభించింది. ప్రారంభంలో ప్రాథమిక స్థాయి నుండి క్రమంగా ఉన్నత పాఠశాల స్థాయికి ఇది విస్తరించింది.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. సుమాలు 447 మంది పిల్లలు ఈ పాఠశాల్లో చదువుతున్నారు.
మొదట్లో కేవలం తెలుగు మీడియం విద్యార్థుల కోసమే ప్రారంభమైనప్పటికీ, మారుతున్న కాలానికి మరియు ప్రభుత్వ విద్యా విధానాలకు అనుగుణంగా ఇందులో ఇంగ్లీష్ మీడియం బోధనను కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ పాఠశాల ఒకటి నుండి 10వ తరగతి విద్యార్థులకు రెండు మాధ్యమాలలోనూ విద్యనందిస్తోంది.

మమ్మల్ని ఫాలో అవ్వండి