- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బండకేసి కొట్టడం ఖాయం
- కాంగ్రెస్‌కు అధికారమిచ్చిన పాపానికి తెలంగాణ నాశనం
- నేతన్నల కడుపు కొట్టి గుజరాత్‌కు ఆర్డర్లు..
- కమిషన్లు దండుకుంటున్నది నువ్వు కాదా?
- పోలీసు బందోబస్తు లేకుండా సిరిసిల్లకు వెళ్లే దమ్ముందా?
సంగారెడ్డి బ్యూరో, న్యూస్ పేజ్ :
కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారమిచ్చిన పాపానికి తెలంగాణ సర్వనాశనం అయ్యిందని, సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో పాలన చేస్తున్నారని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
అబద్ధాలు, బూతులు మాట్లాడటమే పనా?
రేవంత్ రెడ్డి ఏ జిల్లాకు వెళ్లినా, ఏ నియోజకవర్గానికి వెళ్లినా చేసిన పని ఒక్కటీ లేదని, కేవలం అబద్ధాలు చెప్పడం, బూతులు మాట్లాడటం, బీఆర్ఎస్ నాయకులపై అవాకులు చెవాకులు పేలడం తప్ప ముఖ్యమంత్రిగా చేసిందేమీ లేదని నిలదీశారు. పేదల, గిరిజనుల భూములు లాక్కోవడం, అమాయకుల ఇండ్లను కూలగొట్టడం, జనాలను మోసం చేయడం, బ్లాక్మెయిల్ చేసి అందిన కాడికి దండుకోవడమే ఆయన పనని ఆరోపించారు.
నేతన్నల కడుపుకొట్టి కమిషన్ల దందా!
సిరిసిల్ల గడ్డపై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో నేతలకు చేతినిండా పని, కడుపునిండా తిండి లభించిందని, మరిప్పుడు మగ్గాలు ఎందుకు మూగబోయాయో సమాధానం చెప్పాలన్నారు. బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫార్మ్స్ ఆర్డర్లను గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టి కమిషన్లు దండుకుంటున్నది నువ్వు కాదా? అని ప్రశ్నించారు.
పోలీసులు లేకుండా సిరిసిల్ల వెళ్లే దమ్ముందా?
నేతన్నల సంక్షేమానికి ఒక్క అడుగైనా వేసి ఉంటే మూడు, నాలుగు వేల మంది పోలీసుల పహారాలో సభ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. నిజంగా మేలు చేసి ఉంటే పోలీసు బందోబస్తు లేకుండా నేతన్నల దగ్గరికి వెళ్లి చూస్తే వాళ్లే తగిన సమాధానం చెబుతారన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తిడుతూ కాలం గడపడం మానుకొని ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు బండకేసి కొట్టడం ఖాయమని హెచ్చరించారు.

మమ్మల్ని ఫాలో అవ్వండి