- ‘కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్’ పథకాలకు 12 ఏళ్లు పూర్తి
- పేదింటి ఆడబిడ్డలకు 16.78 లక్షల కుటుంబాలకు దక్కిన కేసీఆర్ చేయూత!
- ‘తులం బంగారం’ ఏమైంది రేవంత్ రెడ్డీ?.. హామీలతో గద్దెనెక్కి నిలువునా మోసం చేశారు!
- కేసీఆర్ చిత్రపటానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ఘనంగా పాలాభిషేకం
సంగారెడ్డి బ్యూరో, న్యూస్ పేజ్ :
తెలంగాణ ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలిచిన ‘కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్’ పథకాలు దిగ్విజయంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని, కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్.. పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ ఇచ్చిన కొండంత ధైర్యం!
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేదింటి తల్లిదండ్రులు తమ ఆడబిడ్డ పెళ్లిని భారం అనుకోకుండా, ఆత్మగౌరవంతో జరిపించాలన్న గొప్ప సంకల్పంతో కేసీఆర్ ‘కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్’ పథకాలను తెచ్చారని కొనియాడారు. గత 12 ఏళ్ల కాలంలో ఏకంగా 16.78 లక్షల పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి, వారి ఇళ్లల్లో వెలుగులు నింపిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.
‘తులం బంగారం’ ఏమైంది రేవంత్ రెడ్డీ?.. హామీలతో గద్దెనెక్కి మోసం!
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిప్పులు చెరిగారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు అదనంగా ‘తులం బంగారం’ ఉచితంగా ఇస్తామని ఊదరగొట్టి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తకుండా ఆడబిడ్డలను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. హామీలు ఇచ్చి గద్దెనెక్కడం, తర్వాత పథకాలను గాలికొదిలేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అంతా గందరగోళం, విధ్వంసమే జరుగుతోందని, ఇది మంచి పాలన కాదని.. విధ్వంసానికి తొలి మెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ పాలనే
కాంగ్రెస్ మోసపూరిత పాలనతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని, పేదలకు న్యాయం జరగాలన్నా, సంక్షేమం దక్కాలన్నా కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన కోసమే ఎదురుచూస్తున్నారని, వచ్చేది కచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, ఎస్కే రషీద్, మల్ల గౌడ్, మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, చిల్లేరి ప్రభాకర్, వేణుగోపాలస్వామి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, విరల్, మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు కొత్తపల్లి నాని, జలంధర్, పొన్న దశరథ్‌రెడ్డి, నాయకోటి నవీన్, శ్రీకాంత్, జాఫర్, నాయకులు శ్రావణ్‌రెడ్డి, రాజేందర్‌నాయక్, గోవర్ధన్‌రెడ్డి, రుక్మోద్దీన్ తదితరులతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Tags : MLA Chinta Prabhakar Press Meet, Kalyanalakshmi 12 Years BRS, Sangareddy Political News Updates, Newspage Regional News

మమ్మల్ని ఫాలో అవ్వండి