- సదాశివపేట పోలీసుల మెరుపు వేగం.. క్లూ లెస్ ఆటో చోరీ కేసు చిటికెలో ఛేదన
- శాస్త్రీయ దర్యాప్తుతో పాత నేరస్థుడికి బేడీలు.. చోరీకి గురైన వాహనం రికవరీ
- సీఐ డి.వెంకటేష్, క్రైమ్ టీమ్ ప్రతిభపై సర్వత్రా ప్రశంసల జల్లు!
సదాశివపేట, న్యూస్ పేజ్:
నేరగాళ్లకు సింహస్వప్నంగా నిలుస్తూ సదాశివపేట పోలీసులు మరోసారి తమ చాకచక్యాన్ని నిరూపించుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఆటో కేసును పోలీసులు అత్యంత వేగంగా, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేసి ఛేదించారు. సీఐ డి. వెంకటేష్ పక్కా ప్లానింగ్, క్రైమ్ టీమ్ చురుకైన ఆపరేషన్‌తో నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
అనుమానితుల కదలికలపై నిఘా.. పక్కా స్కెచ్‌తో అరెస్ట్:
సెప్టెంబర్ 29 తెల్లవారుజామున బస్టాండ్ బయట నిలిపిన ఆటో చోరీకి గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేయగానే సీఐ డి.వెంకటేష్ స్వయంగా రంగంలోకి దిగారు. క్రైమ్ సిబ్బందికి దిశానిర్దేశం చేసి రంగంలోకి దించారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును పోలీసులు సవాలుగా స్వీకరించి, సాంకేతిక మరియు శాస్త్రీయ పద్ధతుల్లో రాత్రింబవళ్లు గాలించారు. అనుమానితుల కదలికలను నిశితంగా పరిశీలించి, పక్కా సమాచారంతో నిందితుడు చౌహాన్ గోవింద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పోలీసుల విచారణతో పాత నేరాల గుట్టురట్టు
పోలీసులదైన శైలిలో విచారించడంతో నిందితుడి అసలు రంగు బయటపడింది. జల్సాలు, మద్యానికి బానిసై ఖర్చుల కోసం వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. గతంలో హైదరాబాద్, వరంగల్, రాచకొండ కమిషనరేట్లతో పాటు సదాశివపేట పరిధిలోనూ పలు దొంగతనాలు చేసి జైలుకెళ్లొచ్చిన ఘరానా నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి ఆటోను రికవరీ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. క్లిష్టమైన కేసును తక్కువ సమయంలోనే కొలిక్కి తెచ్చిన క్రైమ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుళ్లు వెంకటేశం, అమానుల్లా, నహీద్ పాషా, వీరేశంల కర్తవ్య నిష్టను సీఐ డి. వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల చురుకైన పనితీరుతో ఆటో దక్కడంతో బాధితుడు ఊపిరి పీల్చుకోగా, పట్టణ ప్రజలు పోలీసుల సమర్థతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags: Newspage, Sadashivapet News, Auto Theft Case Solved, CI D Venkatesh Operation, Sangareddy Crime Police, Chauhan Govind Arrest

మమ్మల్ని ఫాలో అవ్వండి