- ఢిల్లీ సదస్సులో సీఎస్ఆర్ సంస్థలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపు!
- చెరువుల పునరుద్ధరణ కోసం సింగిల్ విండో మాదిరి వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడి.. రూ.2 కోట్లతో రామంతాపూర్ చిన్న చెరువు అభివృద్ధికి జెన్‌ప్యాక్ట్ ఒప్పందం.
హైదరాబాద్, అక్టోబర్ 27, న్యూస్ పేజ్ :
హైదరాబాద్ నగరంలో చెరువుల సమగ్ర అభివృద్ధితోనే వరదలను శాశ్వతంగా కట్టడి చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. వర్షాకాలంలో వచ్చే వరదలు, వేసవి కాలంలో ముంచుకొచ్చే తాగునీటి ఎద్దడి నివారణలో చెరువులు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణను పెద్దయెత్తున చేపట్టింది. ఈ క్రమంలో పట్టణ వరదల నిర్వహణపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పాల్గొని ప్రసంగించారు. నగరంలోని చెరువులు, నాలాల పరిరక్షణకు కార్పోరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యత (CSR) కింద ముందుకు వచ్చి చేయూతనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చెరువుల అభివృద్ధికి ముందుకు వచ్చే సంస్థలకు అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులను ఒకే చోట ‘సింగిల్ విండో’ విధానంలో హైడ్రా ద్వారా వేగంగా మంజూరు చేయిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగరంలో ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమణలు, పూడిక తొలగించి సహజ సిద్ధంగా పునరుద్ధరించిన 6 చెరువుల పూర్వ స్థితిని, ప్రస్తుత ప్రగతిని కళ్లకు కట్టారు. రెండో విడతలో భాగంగా మరో 14 చెరువుల అభివృద్ధి పనులను ప్రారంభించామని, ఎల్‌నినో వంటి కఠినమైన కరువు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవడానికి ఈ జలవనరుల రక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ శ్రీ యూనస్ పర్వేజ్ గారు మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో ముందుకు వచ్చే సంస్థలకు తాము పూర్తి సాంకేతిక సహకారం అందిస్తామని ప్రకటించారు. హైడ్రా చేపట్టిన ఈ అద్భుత పనులను చూసి ఆకర్షితులైన ప్రముఖ ఐటీ రంగ దిగ్గజం జెన్‌ప్యాక్ట్ (Genpact) సంస్థ ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ చిన్న చెరువును రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి చేయడానికి అప్పటికప్పుడే హైడ్రాతో అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది.
అనంతరం అరైజ్ ఇండియా ఫోరం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సమావేశంలో పలు దేశాల ప్రతినిధులు హైడ్రా పనులను వేనోళ్ల కొనియాడారు. నగరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో వరద నీరు చెరువులకు సాఫీగా చేరేలా హైడ్రా చేస్తున్న ఇంజనీరింగ్ ఏర్పాట్లను శ్రీలంక రాజధాని కొలంబో పట్టణ మేయర్ రషీడ్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి (MA&UD) శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ గారి నేతృత్వంలోని తెలంగాణ ఉన్నతాధికారుల బృందం మంగళవారం ఢిల్లీలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారితీ (NDMA) అధికారులను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ బృందంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీమతి సృజన, హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య తదితరులు ఉన్నారు. నగరంలో ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మరియు మౌలిక వసతుల బలోపేతానికి కేంద్రం నుండి రాష్ట్రానికి అత్యవసర నిధులు సమకూర్చాలని వారు ఎన్‌డీఎంఏ అధికారులను కోరారు.
Tags : newspage news, HYDRA Commissioner Ranganath, Genpact CSR Lake Rejuvenation, Jayesh Ranjan NDMA Delhi

మమ్మల్ని ఫాలో అవ్వండి