- ఓరుగల్లు గణేష్ నవరాత్రుల్లో మారిన ట్రెండ్!
- భారీ విగ్రహాలు, అలంకరణలకే ప్రాధాన్యత..
- సాంస్కృతిక ప్రదర్శనలు లేక వెలవెలబోతున్న వీధులు!
వరంగల్ బ్యూరో, న్యూస్ పేజ్ :
వినాయక చవితి అంటేనే ఆబాల గోపాలానికి ఒకటే సందడి. ముఖ్యంగా యూత్ ఫుల్ జోష్‌తో నవరాత్రులను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే కళల నిలయంగా పేరుపొందిన చారిత్రాత్మక ఓరుగల్లు నగరంలో నానాటికి గణేశ మండపాల స్థాపన జోరు మరింతగా పెరిగింది. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న మండపాలు ఇప్పుడు వేల సంఖ్యకు మారిపోయాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీతో పాటు శివారు ప్రాంతాలలో వేల సంఖ్యలో మండపాలు వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఒకే వాడలో కనీసం మూడు నుండి నాలుగు గణేష్ మండపాలు కనిపిస్తున్నాయంటే ఇక్కడ సందడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు
కనుమరుగవుతున్న నాట్యాలు, హరికథల సందడి
ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ఒకప్పుడు నవరాత్రులు వచ్చాయంటే ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో వీధులన్నీ కోలాహలంగా ఉండేవి. కాలక్రమేణా హరికథలు, బుర్రకథల కాలం పోయింది. కానీ చక్కటి భక్తి పాటలు, నృత్య రూపకాలతో కళాకారులు స్టేజీలపై కనువిందు చేసేవారు. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒకటి అర తప్పితే సంస్కృతి కార్యక్రమాల జోరు పూర్తిగా సన్నగిల్లింది. గతంలో ప్రముఖ గాయకులుగా, నాట్యాచార్యులుగా పేరుపొందిన అనేకమంది వినాయక చవితి ఉత్సవాలను తమకు ఒక ఉపాధిగా, ప్రాక్టీస్‌గా భావించేవారు. టాలెంట్ ఉన్న ఎంతోమంది ప్రముఖులు ఈ వేదికల నుంచే వచ్చారు. తొమ్మిది రోజుల్లో రోజుకు రెండు నుండి నాలుగు ప్రోగ్రాముల వరకు వారు చేసేవారు. భక్తులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ ప్రదర్శనలను వీక్షించేవారు.
మారిన నిర్వాహకుల ప్రాధాన్యతలు.. కళాకారుల నిరాశ
- డెకరేషన్లకే భారీ ఖర్చు: రాను రాను మండపాల సంఖ్య పెరిగే సరికి నిర్వాహకుల మధ్య పోటీ పెరిగింది. దీనితో వారు కేవలం భారీ విగ్రహాల స్థాపన, లైటింగ్ డెకరేషన్‌కు మాత్రమే లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు.
- అన్నదానాలకే ప్రాధాన్యత: వీటికి తోడు వారంలో ఒకరోజు అన్నదానం కచ్చితంగా నిర్వహిస్తున్నారు. బడ్జెట్ మొత్తం వీటికే సరిపోతుండటంతో, సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించడానికి నిర్వాహకుల వద్ద నిధులు, అవకాశాలు లేకుండా పోయాయి.
- డీజే ఆంక్షలతో సైలెన్స్: ఒకప్పుడు కళలకు నిలువైన ఓరుగల్లులో కనీసం మండపాలు ఇప్పుడు మైకు పాటలతో మాత్రమే వినిపిస్తున్నాయి. డిజె సౌండ్లు నిషేధించడంతో రికార్డు పాటలను కొద్దిసేపు ఉదయం, సాయంత్రం ప్లే చేసి ముగిస్తున్నారు.
దీనితో, అటు కళాకారులకు నిరాశ, ఇటు చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టే పరిస్థితి నెలకొంది. అటు ఆటపాటలు లేక, ఇటు ఆస్వాదించే కార్యక్రమాలు లేక మండపాలు వెలవెలబోతున్నాయి. భారీ విగ్రహాలు, అలంకరణలతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒకటి రెండు నిర్వహిస్తే పుణ్యం, పురుషోత్తం రెండు ఉంటాయని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Tags : Warangal Ganesh Navratri 2026, Orugallu Vinayaka Chavithi, Cultural Programs At Ganesh Mandaps, Newspage Regional News

మమ్మల్ని ఫాలో అవ్వండి