- గత ఒక ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగిన కోడిగుడ్ల ధరలు..
- రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర ఏకంగా రూ. 6.50 నుండి రూ. 7 కి చేరిక..
- కేంద్ర సర్కార్ ఇంధన పాలసీ, కోళ్ల మేత ఖర్చులు పెరగడమే ప్రధాన కారణం..
మన ఇండ్లల్లో ఉదయం లేవగానే ప్రతిరోజూ గుడ్డు తినడం చాలామందికి అలవాటు. తక్కువ ధరలో దొరికే మంచి ప్రోటీన్ ఫుడ్ ఇదొక్కటే అనుకుంటే.. ఇప్పుడు ఈ కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు గుడ్డు ముట్టుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) లెక్కల ప్రకారం.. ఇప్పుడు ఫామ్‌లలోనే ఒక గుడ్డు ధర రూ. 6 పలుకుతుంటే, బయట కిరాణా కొట్లలో, రిటైల్ మార్కెట్‌లో ఒక గుడ్డు రూ. 6.50 నుంచి రూ. 7 వరకు అమ్ముతున్నారు. కొన్ని ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లలో అయితే ఇది రూ. 14 దాకా కూడా వెళ్తోంది.
హైదరాబాద్ బ్యూరో, న్యూస్ పేజ్ :
ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమలో సరికొత్త సమస్యలు మొదలైనాయి. ఈ ధరలు పెరగడానికి వెనుక ఒక పెద్ద ఆర్థిక కారణం ఉంది. మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే 'ఈ20 ఫ్యూయల్ పాలసీ' ని గట్టిగా ప్రమోట్ చేస్తోంది. ఈ ఇథనాల్ తయారు చేయడానికి ఎక్కువగా మొక్కజొన్న ను వాడుతున్నారు. సాధారణంగా కోళ్ల ఫారాల్లో కోళ్లకు పెట్టే మేతలో 65 నుంచి 70 శాతం మొక్కజొన్నే ఉంటుంది. ఇప్పుడు మొక్కజొన్న అంతా ఇథనాల్ కంపెనీల వైపు మళ్లడం వల్ల మార్కెట్‌లో దానికి గట్టి డిмаండ్ ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి.
ఇదివరకు టన్ను మొక్కజొన్న తక్కువ ధరకే దొరికేది, ఇప్పుడు దాన్ని ఇథనాల్ వైపు మళ్లించడం వల్ల కోళ్ల మేత రేట్లు పెరిగిపోయి.. ఆ భారం కాస్తా గుడ్డు ధరల మీద పడింది. కోళ్ల ఫారాల యజమానులకు ఇప్పుడు కోళ్లను సాకడం ఒక పెద్ద టాస్క్‌లా మారింది. కేవలం మొక్కజొన్నే కాకుండా కోళ్ల మేతలో వాడే సోయాబీన్ ధరలు కూడా భారీగా పెరిగినయి. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు, డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి గుడ్లను సప్లై చేయడానికి అయ్యే ఖర్చు కూడా బాగా ఎక్కువైంది. దీనివల్ల చిన్న కోళ్ల ఫారాల యజమానులు నష్టాలు భరించలేక చాలా చోట్ల కోళ్ల ఫారాలను బంద్ చేశారు, లేదా కోళ్ల సంఖ్యను తగ్గించేశారు. ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కూడా ధరలకు రెక్కలొచ్చినయి.
ముఖ్యాంశాలు
ఇథనాల్ దెబ్బ: కేంద్రం తెచ్చినఈ20 పాలసీ వల్ల మొక్కజొన్న రేట్లు పెరిగి కోళ్ల మేత ఖరీదైనదిగా మారింది.
సప్లై కొరత: నష్టాలు తట్టుకోలేక చాలామంది చిన్న పోల్ట్రీ యజమానులు ఫారాలను బంద్ పెట్టడం వల్ల మార్కెట్లో గుడ్ల కొరత ఏర్పడింది.
వింటర్ అలర్ట్: రాబోయే చలికాలంలో కోడిగుడ్ల వాడకం ఇంకా ఎక్కువైతది కాబట్టి.. మున్ముందు ఒక్కో గుడ్డు ధర రూ. 10 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.
మన దేశంలో జనాభా పెరగడంతో పాటు హెల్త్ కాన్షియస్ ఎక్కువై అందరూ గుడ్లు తినడం పెంచేశారు. కానీ దానికి తగ్గట్టు కోడిగుడ్ల ఉత్పత్తి పెరగట్లేదు. పైగా వాతావరణంలో వస్తున్న మార్పులు, ఎండల తీవ్రత వల్ల కోళ్లు చనిపోవడం కూడా ఎక్కువైంది. సప్లై తక్కువగా ఉండి, డిమాండ్ విపరీతంగా ఉండటం వల్ల ఓపెన్ మార్కెట్‌లో రేట్లు ఆటోమేటిక్‌గా పెరిగిపోతున్నాయి.
మొత్తానికైతే..
ఒకప్పుడు 'సండే అయినా మండే అయినా రోజూ తినండి కోడిగుడ్డు' అనే సామెత ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది. ఇటు ఇథనాల్ బూమ్ దేశానికి మంచిదే అయినా.. అటు కోళ్ల పరిశ్రమను నష్టాల్లోకి నెట్టకుండా మొక్కజొన్న సప్లైని సరిచేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. లేదంటే మున్ముందు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్ లేదా ఉడకబెట్టిన గుడ్డు చూడటం ఒక లగ్జరీగా మారిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tags : బిజినెస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, Poultry News, Egg Prices Hike

మమ్మల్ని ఫాలో అవ్వండి