Ticker

6/recent/ticker-posts

Ad Code

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. హనుమకొండ చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత!

  • దేవుళ్ల మధ్య రేవంత్ రెడ్డి విభజన రాజకీయం
  • హిందూ వ్యతిరేక వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మ దహనం.. 
  • బేషరతుగా క్షమాపణ చెప్పాలని కమలం నేతల డిమాండ్!

BJP Leaders Rao Padma Reddy and Pagadala Kaliprasad Rao Burning Reanth Reddy Effigy At Hanamkonda

హనుమకొండ బ్యూరో, న్యూస్ పేజ్ :

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీజేపీ మధ్య సరికొత్త ‘దేవుళ్ల యుద్ధం’ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసినట్లుగా చెప్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని హిందూ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ.. బీజేపీ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే సనాతన ధర్మంపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని మండిపడుతూ కమలదళం హనుమకొండ నడిబొడ్డున భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. దీనితో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఇరు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఖైరతాబాద్ ఉపఎన్నిక కోసమే కాంగ్రెస్ విద్వేష విషం!

ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి రావు పద్మ రెడ్డి మరియు పరకాల నియోజకవర్గ నేత శ్రీ పగడాల కాళీప్రసాద్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే ఖైరతాబాద్ ఉపఎన్నికలో రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తరహా హిందూ వ్యతిరేక కుట్రలకు తెరలేపారని ధ్వజమెత్తారు. దేవుళ్లను, కులాలను, ప్రాంతాలను వేరు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సమాజంలో విద్వేష విషాన్ని చిమ్ముతోందని వారు తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల సమయంలో దేవుళ్ల పేరిట ప్రమాణాలు చేసి ఓట్లు అడిగిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే దేవుళ్లకు కులం, ప్రాంతం అంటగట్టడం దారుణమన్నారు.

దక్షిణ కాశీ, దక్షిణ అయోధ్య ఉన్న నేలపై సీఎం అజ్ఞానం!

సనాతన ధర్మంలో రాముడు, శివుడు వేరు కాదని, స్వయంగా శ్రీరాముడే ఆ మహాదేవుడిని ఆరాధించాడని బీజేపీ నేతలు గుర్తుచేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం, దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం రామాలయం ఉన్న తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటూ, శ్రీరాముడికి, పరమశివుడికి మధ్య ఉత్తర-దక్షిణ సరికొద్దులు గీయడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి పరాకాష్ట అని విమర్శించారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోని మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయమే హరిహర క్షేత్రానికి ప్రతీక అని, అటువంటి ఆధ్యాత్మిక నేల నుండి వచ్చిన రేవంత్ రెడ్డి దేవుళ్ల మధ్య విభజన తేవడం సిగ్గుచేటని మండిపడ్డారు. హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీసిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

చివరగా.. 

రాజకీయాల్లో ఓట్ల కోసం దేవుళ్లను లాగడం, ప్రాంతీయ సరిహద్దులు గీయడం అనేది ఎల్లప్పుడూ ప్రమాదకరమైన ధోరణి. విపక్ష బీజేపీ ఈ అంశాన్ని హిందూ సెంటిమెంట్‌తో ముడిపెడుతూ కాంగ్రెస్‌ను కట్టడి చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే ఉపఎన్నికల నేపథ్యంలో ఈ ‘హరిహర’ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి!