- సర్కారు స్థలంలో చెట్లు నరికి అమ్ముకున్నోళ్లు ఎవరు?..
- జేబుల్లోకి వెళ్లిన లక్షల రూపాయలపై జనం ఫైర్!
వరంగల్ ప్రతినిధి, వర్ధన్నపేట ఆగస్టు 26 (న్యూస్ పేజ్)
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో ఒక వింత పంచాయితీ నడుస్తోంది. ఊర్లోని డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ (నీటి నిల్వ కట్ట) చుట్టుపక్కల దశాబ్దాలుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను ఎవరో నరికి అమ్మేసిండ్రని, ఆ వచ్చిన పైసలు గ్రామ పంచాయతీ ఖాతాలో జమ కాలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై గిప్పుడు గ్రామస్తులు పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఏం జరిగింది..?
కట్ర్యాల గ్రామ శివారులో ఫ్లోరైడ్ నివారణ కోసం ఏర్పాటు చేసిన డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ కట్ట చుట్టూ పెద్ద ఎత్తున తుమ్మ, వేప మరియు ఇతర చెట్లు దట్టంగా ఉండేవి. అయితే, ఇటీవల కోతుల బెడద ఎక్కువగా ఉందని, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని నెపాలు చెబుతూ ఆ చెట్లన్నింటినీ నరికి అమ్మేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
లక్షల్లో చెట్ల విలువ.. కానీ లెక్కల్లేవు!
నరికిన చెట్ల విలువ సుమారు రూ. 1.50 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ స్థలంలో ఉన్న చెట్లను అమ్మితే ఆ వచ్చిన పైసలను గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పంచాయతీలో జమ కాలేదని పంచాయతీ రికార్డులు చెబుతున్నట్లు సమాచారం తెలుస్తోంది.
ఎవరా లీడర్లు..? డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?
గీ చెట్లను అసలు ఎవరు అమ్మారు? ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? అనే దానిపై గిప్పుడు ఊర్లో పెద్ద చర్చ నడుస్తోంది. కాంట్రాక్టర్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పంచాయతీ అధికారులు అందరూ కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడ్డారని గ్రామస్తులు నేరుగా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి విచారణ జరపాలని, చెట్లు అమ్మిన డబ్బును పంచాయతీలో జమ చేయించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా పంచాయతీ అధికారిని (DPO) కోరుతున్నారు.
వర్ధన్నపేట ఎంపీఓ వివరణ:
ఈ విషయమై వర్ధన్నపేట ఎంపీఓ (MPO) ని వివరణ అడుగగా.. కట్ర్యాల గ్రామ ఊర చెరువులోని డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ గ్రామ పంచాయతీ పరిధిలోకి రాదని, కాబట్టి తమ శాఖకు దీనితో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

మమ్మల్ని ఫాలో అవ్వండి