Ticker

6/recent/ticker-posts

Ad Code

భారీ చిత్రాలకు తెలంగాణ సర్కార్ షాక్!

- టాలీవుడ్ భారీ చిత్రాలకు తెలంగాణ సర్కార్ సరికొత్త రూల్.. 

- టికెట్ల పెంపుపై హోం శాఖ కీలక ఉత్తర్వులు!

హైదరాబాద్ బ్యూరో, న్యూస్ పేజ్ :

తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రత్యేక అనుమతులతో టికెట్ ధరలను పెంచుకునే పెద్ద సినిమాలకు ఒక కొత్త నిబంధనను విధిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

20 శాతం సంక్షేమ నిధికి..

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. టికెట్ రేట్లు పెంచడం ద్వారా థియేటర్లకు వచ్చే అదనపు రాబడిలో (Incremental Revenue) 20 శాతం మొత్తాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) నేతృత్వంలో నడిచే 'తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం' అధికారిక ఖాతాలో జమ చేయాలి.

నిర్మాతలదే పూర్తి బాధ్యత

థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్ల) నుంచి ఈ 20 శాతం అదనపు సొమ్మును వసూలు చేసి, సంక్షేమ నిధి ఖాతాకు చేర్చే పూర్తి బాధ్యతను చిత్ర నిర్మాణ సంస్థలకే అప్పగించారు. ఈ నిబంధనను పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పెద్ద సినిమాలకు నోటీసులు

రాష్ట్రంలో త్వరలో విడుదల కానున్న అలాగే ఇటీవల అనుమతులు పొందిన అఖండ-2, ది రాజాసాబ్, మన శంకర వర ప్రసాద్ గారు, పెద్ది చిత్రాలకు ఈ నిబంధన వర్తింపజేశారు. ఈ చిత్రాల నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ప్లస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్, వృద్ధి సినిమాస్‌లకు హోం శాఖ ఇప్పటికే ప్రత్యేక లేఖలు పంపింది. సినీ పరిశ్రమలో రాత్రింబవళ్లు కష్టపడే రోజువారీ కార్మికులు, టెక్నీషియన్ల సంక్షేమానికి ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

- క్రెడిట్ : "సమాచార సౌజన్యం: తెలంగాణ హోం శాఖ అధికారిక ఉత్తర్వులు"