భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'విశ్వనటుడు' (Universal Hero) కమల్ హాసన్ ప్రస్థానం ఒక నిఘంటువు లాంటిది. 1960లో ఐదేళ్ల వయసులో ‘కళత్తూర్ కణ్ణమ్మ’ అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెమెరా ముందుకు వచ్చిన ఈ నటనాలయం.. సినిమా రంగంలో విజయవంతంగా 67 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ప్రపంచ సినిమా 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంటే, అందులో సగానికి పైగా (67 ఏళ్లు) చరిత్ర కేవలం కమల్ హాసన్ ఒక్కడి ప్రయాణంలోనే దాగుండటం ఒక అరుదైన ప్రపంచ రికార్డు.ఇటీవల ఈ అసాధారణ మైలురాయిపై కమల్ హాసన్ తన సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
"నేను కేవలం 20 ఏళ్లే నేర్చుకున్నాను"
తమ అభిమాన నటుడి 67 ఏళ్ల రికార్డుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తుంటే, కమల్ హాసన్ మాత్రం ఎంతో వినమ్రంగా స్పందించారు. "సినిమాలో నా 67 ఏళ్ల ప్రయాణంలో.. కేవలం 20 సంవత్సరాలు మాత్రమే నేను నిజంగా నేర్చుకున్న కాలంగా భావిస్తున్నాను. మిగిలినదంతా ప్రవాహంతో పాటు కొట్టుకుపోవడమే" అంటూ ఆయన రాసుకొచ్చారు. సినిమాపై ఉన్న అపరిమితమైన ప్రేమ, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపనే ఆయనను ఈ స్థాయికి చేర్చాయని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. తన వయసు 71 ఏళ్లు దాటినా, నేటితరం సాంకేతికతకు అనుగుణంగా అప్‌డేట్ అవుతుండటం వల్లే కమల్ హాసన్ తనను తాను "సినిమా ప్రపంచంలోనే ఓల్డెస్ట్ జెన్ జీ (Oldest of Gen Z in cinema)" గా అభివర్ణించుకున్నారు. గతేడాది కూడా ఆయన అమెరికాలో దాదాపు 90 రోజుల పాటు ప్రత్యేకంగా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)' పై కోర్సు చేసి వచ్చి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు.
సరిహద్దులు లేని నట ప్రయాణం
కమల్ హాసన్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు. ఆయన దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్, నిర్మాత, ప్లేబ్యాక్ సింగర్, కొరియోగ్రాఫర్, మరియు హాలీవుడ్ స్థాయి 'ప్రోస్తెటిక్ మేకప్ ఆర్టిస్ట్' కూడా. ‘మరో చరిత్ర’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ‘నాయకుడు’, ‘పుష్పక విమానం’, ‘భారతీయుడు’, ‘దశావతారం’, ‘విక్రమ్’, మరియు ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో సుప్రీం యాస్కిన్ పాత్ర వరకు ఆయన చేసిన ప్రయోగాలు భారతీయ సినిమా గర్వించదగ్గవి.మణిరత్నంతో కలిసి చేసిన ‘థగ్ లైఫ్’ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేయబోయే మల్టీస్టారర్ ప్రాజెక్టులతో ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీనిస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు.

మమ్మల్ని ఫాలో అవ్వండి