- ఐదేళ్ల పదవీకాలంలో మండల అభివృద్ధికి కృషి..
- సచివాలయం-1 లో ఘనంగా ముగిసిన శంఖవరం మండల సర్వసభ్య సమావేశం..
- ఇటీవల మృతి చెందిన ఎంపీటీసీ సభ్యుడు నానాజీకి సభలో ఘన నివాళులు!
- పదవీకాలం ముగిసిన సందర్భంగా ఎంపీపీ రాజబాబుకు ఆత్మీయ సన్మానం..
శంఖవరం ప్రతినిధి, న్యూస్ పేజ్ :
మృదుస్వభావంతో, అందరితో ఆప్యాయంగా మెలుగుతూ, ఎవరికీ కీడు తలపెట్టకుండా అజాతశత్రువుగా పేరుపొందిన శంఖవరం మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) పర్వత రాజబాబు అని మండల పాలకవర్గ సభ్యులు, అధికారులు కొనియాడారు. పదవీకాలం ముగిసిన సందర్భంగా శంఖవరం గ్రామ సచివాలయం–1లో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం, ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాజబాబు సేవలను పలువురు ప్రత్యేకంగా గుర్తుచేశారు.
సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల మృతి చెందిన ఎంపీటీసీ సభ్యుడు నడిగట్ల నానాజీకి మూడు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ పర్వత రాజబాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పూర్తయిన పనులు, ప్రస్తుత పరిస్థితి, రాబోయే రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను పాలకవర్గ సభ్యులకు వివరించారు.
మండల పరిషత్ పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పర్వత రాజబాబును మండల పాలకవర్గ సభ్యులు, అధికారులు పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి మెమొంటోను అందజేశారు. అనంతరం ఎంపీపీతో పాటు పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రతి పాలకవర్గ సభ్యుడిని అధికారులు, ఎంపీపీ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ పర్వత రాజబాబు మాట్లాడుతూ, గత ఐదేళ్ల కాలంలో శంఖవరం మండల అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరిగిందన్నారు. మండలంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పాలకవర్గ సభ్యులతో కలిసి పనిచేశానని తెలిపారు. తన పదవీకాలంలో సహకరించిన మండల అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం వల్లే మండల పరిషత్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లగలిగామని పేర్కొన్నారు.
మండల ఉపాధ్యక్షుడు దారా వెంకటరమణ మాట్లాడుతూ పర్వత రాజబాబు ఎంతో సౌమ్యుడు, మృదుస్వభావి అని అన్నారు. రాజకీయ, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకుని వెళ్లే తత్వం ఆయనదని పేర్కొన్నారు. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకుండా అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ అజాతశత్రువుగా నిలిచారని కొనియాడారు. ఐదేళ్ల పదవీకాలంలో పాలకవర్గ సభ్యులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ, పర్వత రాజబాబు నాయకత్వంలో మండల పరిషత్ పాలకవర్గం ఐదేళ్లపాటు ఐక్యంగా పనిచేసిందని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలన సాగించేందుకు ప్రయత్నించామని తెలిపారు. పదవీకాలం ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశం తమకు మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి యు. నాగేంద్ర, మండల తహసీల్దార్ సూరిబాబు, మండల ఉపాధ్యక్షులు ఈగల చిన్నఅమ్ములు, దారా వెంకటరమణ, ఎంపీపీ డడాల సతీష్, జీలకర్ర విష్ణు, చొప్పా దేవి, చల్లా సత్యప్రసాద్, పిర్ల నాగేశ్వరావు, డిప్యూటీ ఎంపీడీవో లు నాగలక్ష్మి, వెంకాయమ్మ, ఏఓ పుష్యమి కీర్తి, మండల విద్యాశాఖ అధికారి ఎస్.వి.వి. రమణ, మండల వ్యవసాయశాఖ అధికారి పి. గాంధీ, ఐసీడీఎస్ సిడిపిఓ పర్వత వెంకటలక్ష్మి, సూపర్వైజర్ బి.వి. రజని, మండల వైద్యాధికారి ఎస్.ఎస్. రాజీవ్ కుమార్, ఐకేపీ ఏపీఎం వి. శ్రీనివాస్, ఏపీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags : Shankhavaram MPP Raja Babu, Mandal Sarvasabha Samavesam, Kakinada Local News, Newspage Andhra Pradesh Updates

మమ్మల్ని ఫాలో అవ్వండి